ఏపీ మంత్రి అంబటి రాంబాబు(AP Minister Ambati Rambabu) జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాలో ఆయన ఇవాళ(శనివారం) మీడియా సమావేశంలో మాట్లాడారు. రాబోయేది జగన్ ప్రభుత్వమే అని ప్రజలు ఆలోచించే తీరును గమనిస్తున్నామన్నారు.
ఇంకా సీఎం జగనన్ను ఎదుర్కొనే శక్తి టీడీపీ, జనసేనకు లేదన్నారు. తాడేపల్లిగూడెం సభలో వాళ్ల జెండా ఎత్తేశారన్నారు. పవన్ మాట్లాడేది మొత్తం సినిమా డైలాగులేనని, రాష్ట్రానికి సీఎంగా జగన్ కావాలా.. ? 2019లో తుక్కు తుక్కుగా ఓడిన చంద్రబాబు కావాలా..? అని ప్రజలను అడిగితే.. ప్రలందరూ జగన్ పక్షానే ఉన్నారని తెలిపారు. 175 స్థానాల్లో వైసీపీ గెలవబోతుందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ కేవలం తెలుగు దేశం కోసమే జనసేన పార్టీని నడుపుతున్నారని తెలిపారు. నిన్నటి దాకా జనసేనకు మద్దతు తెలిపిన కాపులంతా ఆ పార్టీని వదిలి వైసీపీలో చేరుతున్నారని దుయ్యబట్టారు. కాపు నేత హరిరామ జోగయ్య వాళ్ల కుమారుడు కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారని గుర్తుచేశారు.
జనసేన మీద ఆశలు పెట్టుకున్న కాపులంతా పవన్.. చంద్రబాబు చెంతకు చేరడంతో మోసపోయామని భావించారని, పవర్ షేరింగ్ లేకుండా పోవడంతో కాపులు నిరాశకు గురయ్యారని తెలిపారు. మార్చి 10న నాల్గో సిద్ధం సభతో టీడీపీ, జనసేన పని గోవిందేనని ఎద్దేవా చేశారు. సిద్ధానికి పోటీగా సభలు నిర్వహించలేకపోతున్నారని విమర్శించారు.