పవన్ కల్యాణ్(Pawan Kalyan) డైలాగ్లు సినిమాల్లో వర్కౌట్ అవుతాయి కానీ రాజకీయాల్లో పని చేయవని మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సత్తెనపల్లిలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఈ సారి ఒక్క ఓటు తగ్గినా తాను నైతికంగా ఓడినట్లేనని సవాల్ చేశారు.
సత్తెనపల్లి నుంచి అనిల్ కుమార్ యాదవ్కు అత్యధిక మెజార్టీ రావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ రెండోసారి సీఎం అవ్వడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తాను అసెంబ్లీకి వెళ్లకుండా టీడీపీ, జనసేన, బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కదని గోబెల్స్ ప్రచారం జరిగిందని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడని ఎద్దేవా చేశారు.
మరోవైపు, జనసేనపై ఆ పార్టీ మాజీ నేత డీఎంఆర్ శేఖర్ తీవ్ర విమర్శలు చేశారు. జనసేన పార్టీలో కనీస గౌరవం, గుర్తింపు దక్కలేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరానని క్లారిటీ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ వల్ల జనసేన పార్టీ నాశనం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాదెండ్లను ప్రోత్సాహించడం మానుకోవాలని హితవుపలికారు. అమలాపురం పార్లమెంట్ సీటుపై గతంలో మాట ఇచ్చి తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొత్తులో భాగంగా త్యాగాలు చేయాలి కానీ.. ఇంకో పార్టీ కోసం త్యాగం చేయకూడదని సెటైర్ వేశారు. ఇదే వైఖరి కొనసాగిస్తే జనసేన మనుగడ కష్టమన్నారు. డీఎంఆర్ శేఖర్ అమలాపురం ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ ఆయనకు పవన్ కల్యాణ్ టికెట్ నిరాకరించారు. పొత్తులో భాగంగా అమలాపురం ఎంపీ టికెట్ బీజేపీకి.. అసెంబ్లీ టికెట్ టీడీపీకి దక్కింది. దీంతో శేఖర్ వైసీపీలో చేరారు.