టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును(Chandrababu Naidu Arrest) ఖండిస్తూ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి మరీ ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాకు వచ్చిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది.
ఖమ్మంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అంబటి రాంబాబు(Ambati Rambabu)ను టీటీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన బస చేసిన హోటల్ వద్దకు వచ్చిన తెలంగాణ టీడీపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం ఎందుకు వచ్చారని వారు ప్రశ్నించారు. ‘ఇక్కడ నీకేం పని.. ఎందుకొచ్చావ్’ అంటూ నిలదీశారు.
హోటల్ నుంచి బయటకు వెళ్తున్న అంబటి రాంబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కర్రతో అంబటిపై దాడి చేయడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసన తెలుపుతున్న టీటీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు నిజామాబాద్ జిల్లా బోధన్‌లో చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా.. ఆయన మద్దతుదారులు 36రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు గురువారం టెంట్ తొలగించారు. దీంతో వారు భవానిపేట్ గ్రామంలో రహదారులు ఊడ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు రోజూ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు తేల్చిచెప్పారు.