నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) వివాదం పై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.. జల వివాదం చాలా సున్నితమైన అంశం అని పేర్కొన్న అంబటి.. సాగర్ పై ఏపీ పోలీసుల దండయాత్ర అని దుష్ప్రచారం చేస్తుండటం సమంజసం కాదని మండిపడ్డారు. పదే పదే తెలంగాణ రాష్ట్రాన్ని సాగు నీరు కోసం అడుక్కోవాలా? అంటూ ఆగ్రహించిన అంబటి.. మా వాటాకు మించి ఒక్క నీటి చుక్క వాడుకోలేదని వెల్లడించారు.
మా రైతులకు.. మా నీరు విడుదల చేసుకుంటుంటే.. అనుమతులంటూ రాద్దాంతం చేయడం ఏంటని అంబటి రాంబాబు (Ambati Rambabu) అసహనం వ్యక్తం చేశారు.. మా భూ భాగంగలోకి మా పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుందిని ప్రశ్నించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు యత్నిస్తే దానిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు ఆంధ్ర భూభాగంలో తెలంగాణ పోలీసులు ఉంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు..
చంద్రబాబు అసమర్థత వల్ల తెలంగాణ (Telangana) పోలీసులు.. ఏపీ భూభాగంలోకి వచ్చారని ఆరోపించిన అంబటి రాంబాబు.. బాబు సర్కార్ ఫెయిలైతే.. జగన్ (Jagan) సర్కార్ సక్సెస్ అయిందని తెలిపారు. చంద్రబాబు ఏపీ హక్కుల్ని తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి అని విమర్శలు గుప్పించారు. ఈ అంశం పై పురంధేశ్వరి ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం, ఏపీ హక్కులకు భంగం కలిగేలా ప్రాజెక్టు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని నిర్వహించడం వల్ల ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని అంబటి ఆరోపించారు. ఏపీకి కృష్ణా జలాల్లో 66 శాతం.. తెలంగాణకు 34 శాతం దక్కుతాయని అంబటి తేల్చిచెప్పారు. కృష్ణా బోర్డు సభ్యులకు కూడా తమ వాదనలు వినిపిస్తామని వెల్లడించారు.
మరోవైపు రాష్ట్రంలో ఒక పార్టీని గెలిపించాలని.. ఓడించాలని భావించే సంస్కృతి మాకు లేదని అంబటి తెలిపారు. మీ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తే మాకేంటని ప్రశ్నించారు. కొందరు రెచ్చగొట్టి గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపణలు చేశారు..