పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలు నేతల మాటలతో దద్దరిల్లి పోతున్నాయి.. విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న పార్టీలు ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి.. ఇక స్వయంగా రంగంలోకి దిగిన మోడీ, అమిత్‌షా కాంగ్రెస్ (Congress)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం కనిపిస్తోంది. మూడోసారి గెలిచి హ్యట్రిక్ కొట్టాలని చూస్తున్న బీజేపీ (BJP) ఆదిశగా వ్యూహాలను రచిస్తోంది..
ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో జోష్ గా పాల్గొంటున్న కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah).. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలపై విమర్శలు గుప్పించారు.. రక్తపాతం జరగడానికి మూలకారణం అయిన కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.. తప్పుడు సంకేతాలతో ఆ పార్టీ వెళ్తుందని ఆరోపణలు చేశారు..
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడం వలన ఇక్కడ రక్తపాతం జరుగుతుందని, గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయని వారు చెప్పడం నమ్మశక్యంగా ఉందా అని ప్రశ్నించిన అమిత్ షా.. ప్రధాని మోడీ (Modi) తీసుకున్న సాహసోపేతమైన చర్యల తర్వాత ఎలాంటి ఆందోళనలు జరగలేదని పేర్కొనారు.. రాజస్థాన్ (Rajasthan), ఉదయ్‌పూర్ రోడ్‌షోలో పాల్గొన్న ఆయన.. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు సాధారణంగా ఉన్నాయని తెలిపారు..
దేశంలో ఉన్నది ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వమని, ఈరోజు అక్కడ రాయి విసిరే దమ్ము ఎవరికీ లేదని పేర్కొన్నారు. గత 23 ఏళ్లుగా ఎలాంటి సెలవులు లేకుండా దేశం కోసం పనిచేస్తున్నారని, పని పట్ల ఉన్న ఆయన అంకితభావానికి ఆకర్షితులు అవుతున్నారని తెలిపారు.. కానీ రాహుల్ గాంధీ ప్రతి మూడు నెలలకోసారి విదేశాలకు విహారయాత్రకు వెళతారని అమిత్‌షా విమర్శించారు.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఈ సార్వత్రిక ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు..