లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ (BJP)దూకుడు పెంచుతోంది. ఎన్నికల నేపథ్యంలో టీ-బీజేపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసేందుకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణకు వస్తున్నారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది.
మొత్తం మూడు జిల్లాల పార్టీ శ్రేణులతో అమిత్ షా సమావేశం కానున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా నేతలకు అమిత్ షా మార్గదర్శనం చేయనున్నారు. దీంతో పాటు కీలకమైన మెనిఫెస్టోకు సంబంధించిన విషయాలపై కూడా ఆయన తెలంగాణ నేతలతో చర్చించనున్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు.
ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. బేగం పేట నుంచి అమిత్ షా నేరుగా హెలికాప్టర్లో మహబూబ్నగర్ చేరుకుంటారు. జిల్లాలో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశంలో అమిత్ షా పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం సాయంత్రం 3.55 గంటలకు హెలికాప్టర్లో కరీంనగర్ వెళతారు.
అక్కడ పార్టీ సమావేశంలో పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ నిర్వహించే మేధావుల సమావేశంలో ముఖ్య అతిథిగా షా పాల్గొంటారు. పార్టీ మెనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాపై ఈ సమావేశంలో మేధావుల, పార్టీ నేతల సూచనలు, సలహాలను అమిత్ షా స్వీకరిస్తారు. అనంతరం రాత్రి 7.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తారు.