కేంద్రంలో మూడోసారి భారతీయ జనతాపార్టీ(BJP) అధికారంలోకి రావాలని అన్ని ప్రయత్నాలను చేస్తోంది. తెలంగాణలో పది ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) తెలంగాణ పర్యటన ఖరారైంది.
ఈ నెల 24వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నిర్వహిస్తోన్న విజయ సంకల్ప యాత్రలో అమిత్ షా పాల్గొన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమిత్‌షా వరుసగా పలుమార్లు తెలంగాణ పర్యటనలో భాగంగా పలు సభల్లో పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రానప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం బీజేపీ కాస్త పుంజుకుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రచారం మొదలుపెట్టింది.
ఇప్పటికే విజయ సంకల్ప రథయాత్రలను కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ను మినహాయించి 16 ఎంపీ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో మూడు నుంచి నాలుగు ఎంపీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఐదు క్లస్టర్లకు చారిత్రక ప్రదేశాల పేర్లు పెట్టారు.