అనంతపురం (Anantapur) జిల్లా కుందుర్పి (Kundurpi) మండలంలో నిర్వహిస్తున్న రథోత్సవం (Rathotsavam)లో అపశృతి చోటుచేసుకొంది. శనివారం రాత్రి రథం లాగుతుండగా ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భక్తులు ఒక్కసారిగా అరుపులు, కేకలతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులకు గాయాలు అయ్యాయని సమాచారం..
అప్పిలేపల్లి (Appilepalli)లో ఆంజనేయస్వామి (Anjaneya Swamy) ఆలయ రథోత్సవ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మహా ఘట్టాన్ని తిలికించేందుకు భక్తులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకొన్నారు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది. కాగా, ఆంజనేయస్వామి రథం కూలిపోవడంతో అక్కడి ప్రజలు ఈ ఘటనను అరిష్టంగా భావిస్తున్నారు.
గతంలో ఎప్పుడు ఇలా జరుగలేదని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రథం కుప్పకూలిన సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొన్నారు. గాయపడిన భక్తులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.