ఏపీ (AP) పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైందని జనం అనుకుంటున్నారు. ఎందుకంటే గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటి నిర్వాహణ బాధ్యతలు మరిచారంటూ విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయితీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మార్చిన ప్రభుత్వం వాటికి అద్దెలు చెల్లించక పోవడంతో భవన యజమానులు తాళాలు వేస్తున్న దృశ్యాలు తరచుగా కనిపిస్తున్నాయి..
ఈ నేపథ్యంలో ఏడు నెలల నుంచి అద్దె చెల్లించకపోవడంతో గ్రామ సచివాలయం భవనానికి (Village Secretariat Building) తాళం వేశారు భవన యజమాని. ఈ ఘటన పల్నాడు (Palnadu) జిల్లాలో వెలుగు చూసింది.. అమరావతి (Amaravati)లో ఉన్న గ్రామ సచివాలయం-2 నిర్వహణకు నెలకు రూ.8,500 అద్దె చెల్లిస్తామని తీసుకున్న అధికారులు ఏడు నెలలుగా చెల్లించకపోవడంతో ఆ ఇంటి యజమాని విసుగు చెందాడు.
అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఎంపీడీవోను పలుమార్లు కలిసినా స్పందన రాలేదని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యదర్శి నాగరాజును అడిగితే తమకు సంబంధం లేదనడంతో తాళం వేశారు యజమాని.. సోమవారం గాంధీ జయంతి రోజున సెలవు కావడంతో సిబ్బంది తాళం వేసి వెళ్లారు. ఆ తర్వాత యజమాని మరో తాళం వేశారు.
ఈ విషయమై ఎంపీడీఓ మాధురి దృష్టికి తీసుకు వెళ్ళగా.. అద్దె చెల్లించకపోవడంతో యజమాని తాళం వేశారని, కొత్త సచివాలయ భవనం త్వరలోనే సిద్ధమవుతుందని తెలిపారు. అప్పటి వరకు విధులకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.