– విజయవాడలో జగన్ పై రాయి దాడి
– కంటిపై భాగంలో గాయం
– విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స
– సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ వార్
– కోడి కత్తి డ్రామా మాదిరిగా ఉందన్న టీడీపీ
– దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉందంటున్న వైసీపీ
– జగన్ పై దాడిని ఖండించిన తెలుగు రాష్ట్రాల నేతలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్ర చేస్తున్నారు ఏపీ సీఎం జగన్ (CM Jagan). ఈ క్రమంలోనే విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని గంగారం గుడి సెంటర్ వద్దకు రాగానే, ఓ వైపు నుంచి రాయి వచ్చి ఆయన్ను తాకింది. ఈ ఘటనలో జగన్ ఎడమ కనురెప్పపై భాగంలో గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వైద్యులు అయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు జగన్.
జగన్ పై జరిగిన దాడిని లోతుగా విచారణ జరుపుతున్నారు ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు. అలాగే, దాడి ఘటనపై జాతీయ ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఘటనపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈ ఘటనను తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఖండించారు. చంద్రబాబు, కేటీఆర్, హరీష్ రావు, షర్మిల సహా వైసీపీ నేతలు తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో దాడులు మంచిది కాదని హితవు పలికారు.
మరోవైపు, టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది. ఇందులో చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ ఆరోపించింది. సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక పచ్చ గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని, ప్రజలందరూ మే 13న దీనికి సమాధానం చెప్తారని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది.
అయితే, టీడీపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 2019 సమయంలో జరిగిన కోడికత్తి దాడి ఘటనను గుర్తు చేసింది. ఎలక్షన్స్ రాగానే సింపతీ క్రియేట్ చేయడానికి జగన్ ప్రయత్నిస్తుంటారనే అర్థం వచ్చేలా ఫోటోలతో సహా పోస్ట్ పెట్టింది. ఇటు, టీడీపీ, వైసీపీ నేతలు కూడా పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు.