ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కమిటీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) రాజీనామా చేశారు. నేడు తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge)కు పంపారు. త్వరలో ఏపీకి కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం చేపట్టనున్న నేపథ్యంలో రుద్రరాజు ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్టు సమాచారం.
ఇటీవల కాంగ్రెస్ (Congress)లో చేరిన వైఎస్ షర్మిల (YS Sharmila)కు పీసీసీ (PCC) పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పీసీసీ చీఫ్ పదవిపై షర్మిలకు ఇప్పటికే ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశాల మేరకే రుద్రరాజు తప్పుకొన్నారని సమాచారం. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట పార్టీలో చేరిన షర్మిలకు.. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టేందుకు రూట్ క్లియర్ అయినట్టు చర్చించుకొంటున్నారు.
గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పేరిట కొత్త పార్టీ పెట్టిన షర్మిల.. అసెంబ్లీ ఎన్నికల వేళ పోటీ చేయడం లేదని ప్రకటించి తప్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఎన్నికలకు ముందు అధిష్టానం పెద్దల్ని కలిసి, పార్టీ విలీనంపై చర్చలు జరిపినట్లు తెలిసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకొంది. అయితే అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు..
ఇక పీసీసీ చీఫ్గా షర్మిలను నియమిస్తే.. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశాలున్నాయని అనుకొంటున్నారు. ఒకవైపు టీడీపీ.. జనసేన.. మరోవైపు తొడబుట్టిన అన్న జగన్.. వీరిద్దరి మధ్య నెగ్గుకొని, పార్టీకి మైలేజ్ వచ్చేలా చేయడం పులివెందుల బిడ్డకి పులిమీద స్వారీ చేసినట్టు ఉంటుందని చర్చించుకొంటున్నారు.. మొత్తానికి గిడుగు ఎగ్జిట్ షర్మిల ఎంటర్ తో.. ఏపీలో కాంగ్రెస్ ఏ మేరకు ఫలితాలు సాధిస్తుందో అనే ఆసక్తి నెలకొంది..