ప్రస్తుతం రాజకీయాలను నడుపుతున్న వాటిలో మద్యం నుంచి వచ్చే ఆదాయం ఒకటని జనం అనుకోవడం తెలిసిందే.. అలాంటి మద్యం ధరలు రోజురోజుకు కొండెక్కి ప్రభుత్వాలకు ఇంకా ఆదాయాన్ని పెంచుతున్నాయి. ఇక మందు బాబులకు మద్యం అమృతంతో సమానం అంటారు. ఈ పానీయం అలవాటున్న వారు మద్యం దొరక్కపోతే అల్లాడి పోతారు. అందుకే అప్పుచేసైన మద్యం తాగుతారు. ఇలాంటి వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం. మద్యం ధరలను (Liquor Price) పెంచుతున్నట్టు (Hikes) ప్రకటించింది. క్వార్డర్ పై రూ. 10, ఫుల్ బాటిల్‌పై రూ. 20 చొప్పున పెంచిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు విదేశీ మద్యంపై కూడా ధరలు పెంచింది. పన్నుల సవరణ పేరుతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ.. మద్యంపై విధించే అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ARET)ను రూపాయల నుంచి శాతాల్లోకి మారుస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఏఆర్ఈటీ శ్లాబుల ఆధారంగా రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై పన్నులు సమానంగా లేవని, అన్నీ ఒకేలా ఉండటం కోసం శాతాల్లోకి మార్చాలని ఏపీఎస్‌డీసీఎల్ (APSDCL) ప్రతిపాదించగా.. దీనికి ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది.