అసెంబ్లీ ఎన్నికల (Assembly elections)వేళ ఏపీ (AP)లో హడావుడి కనిపిస్తున్నట్టు లేదని అనుకొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ (YCP) కి ఎదురులేదని జగన్ (Jagan) అభిమానులు జోష్ లో ఉన్నారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకొన్న నేపథ్యంలో ఏపీలో అసలు ఎన్నికలు ఉన్నాయా? అని కొందరు సందేహ పడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీకి ఘాటు విమర్శల అస్త్రాలు తగలడం లేదంటున్నారు. ఇక జనసేన (Janasena)అప్పుడప్పుడు ఓ రాయి వేస్తుందని అభిప్రాయపడుతున్నారు ఏపీ ప్రజలు. కాగా ప్రస్తుతం జగన్ సర్కారుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విమర్శలు గుప్పించారు.
అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం 743 కోట్లు దోచుకుందని, విద్యాశాఖలో అనేక అవకతవకలు జరుగున్నాయని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రజల డబ్బును ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం సమయానికి టీచర్లకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని నాదెండ్ల వెల్లడించారు. మూడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్దుల వరకు టోఫెల్ పరీక్షపై ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ఏదో చెబుతారు. ఫీజులు కట్టి టెస్ట్ లు రాశాక ఇచ్చే టోఫెల్ సర్టిఫికేట్ల వల్ల ప్రయోజనం ఏమిటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
సీఎం ఈ విధానాన్ని రుద్దటానికి కారణం ఏమిటన్న నాదెండ్ల.. ఇంగ్లీష్ మీడియం మాత్రమే కరెక్టు కాదని జాతీయ విద్యా విధానం చెప్పిన తర్వాత కూడా జగన్ ముందుకు సాగడం వింతగా ఉందని దుయ్యబట్టారు. ఎవరి కోసం ఇలా ప్రజా సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంగ్లీష్ విద్య అగ్రిమెంట్ల గురించి మంత్రికి తెలుసా? ప్రభుత్వంపైనా, మీ శాఖపైనా మీకు పట్టు లేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు నాదెండ్ల..
సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2023 వరకు 4,48,136 మంది విద్యార్దులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తప్పుకున్నట్టు సర్వే లెక్కలు చెప్పిందన్న నాదెండ్ల అమ్మఒడి, విద్యాకానుకలు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. విద్యా కానుకలు 39,95,992 లక్షల మందికి, అమ్మఒడి 42, 61,965 మందికి ఇచ్చామని చెప్పారు. ఈ రెండింటిలో ఇంత వ్యత్యాసం ఎలా వచ్చిందో చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ఏదో హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షాలను విమర్శించడం తప్పితే మీరు చేసిన అభివృద్ధి ఏదని నాదెండ్ల అన్నారు. అమ్మఒడిలో పెద్ద స్కాం జరిగిందనేది వాస్తవం.. అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం రూ. 743 కోట్లు దోచుకుంది నిజం అని నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేశారు..