అంగన్వాడీల(Anganwadis)ఆందోళనలపై ఏపీ సర్కార్(AP Government) సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Javahar Reddy) ఆదేశాల మేరకు కలెక్టర్లు ఆదిశగా చర్యలు ముమ్మరం చేశారు.
విజయనగరం, పార్వతిపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్లు. మిగిలిన జిల్లాల్లోనూ టర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు సిద్ధమవుతున్నారు. అంతేకాదు.. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు ఉపక్రమించనున్నారు.
ఇక, పార్వతీపురం మన్యం జిల్లాలో విధులకు హాజరుకాని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను తొలగిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇప్పటికే అనేక రోజులుగా వేచిచూశాం.. నేడు తొలగింపు ఉత్తర్వులు జారీ చేస్తున్నాం.. నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త నియామకాలు చేపడతాం..’ అని తెలిపారు.
ఇక్కడ అంగన్వాడీ విధులకు హాజరు కాని కార్యకర్తలు 1444 మంది, ఆయాలు 931 మంది ఉన్నారని, జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి, సాధికారిత అధికారి ఎంఎన్ రాణి తెలిపారు. అదేవిధంగా ఈ నెల 25న కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు, విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలకు నేటి నుంచి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
విజయనగరం జిల్లా పరిధిలో 4151 అంగన్వాడీ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ఇవాళ్టి వరకు జిల్లాలో 503 మంది విధుల్లో చేరారని తెలిపారు. సోమవారం ఉదయం 9:30 గంటల వరకు కూడా తిరిగి విధులకు హాజరు కావడానికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. వారు మినహా ఇంకా విధుల్లో చేరని వారిని విధిల్లోంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు.