ఒడిశా రైలు ప్రమాదం జ్ఞాపకాలు ఇంకా మరువక ముందే విజయనగరం (vizianagaram)సమీపంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వచ్చి ఢీకొన్నాయి. కంటకాపల్లి- అలమండ మధ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్‌పై విశాఖ నుంచి బయల్దేరిన విశాఖపట్నం (visakhapatnam) పలాస (palasa) రైలును విశాఖ పట్నం రాయగడ (rayagada) ట్రైన్ ఢీ కొట్టింది. దీంతో పక్కనే ఉన్న గూడ్స్ ట్రైన్ పైకి బోగీలు దూసుకెళ్లాయి.
ఒడిశాలోని బాలేశ్వర్‌లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. కాగా ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. గాయపడ్డ వారికి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులను పరామర్శించడానికి ఏపీ సీఎం జగన్ ఆస్పత్రికి వెళ్లారు. ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం.. ప్రమాదంలో గాయపడిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్న జగన్.. రైలు ప్రమాద బాధితులకు ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడేవరకు ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు..
మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 10లక్షల ఆర్థికసాయం ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ. 2లక్షలు, సాధారణ గాయాలైన వాళ్లకు రూ. 50 వేల సాయం అందిస్తామని అన్నారు.. ఈ సాయంత్రం లోపే ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఈ రూట్ లో ప్రయాణించే 27 రైళ్లు రద్దు చేయగా.. 28 రైళ్ళను దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. విజయనగరం రైల్వే ప్రమాద ఘటనా స్థలంలో యుద్ధప్రాతిపాదికన చర్యలు చేపట్టిన అధికారులు 140 టన్ ల బాహుబలి క్రేన్‌తో ధ్వంసమైన బోగీలను తొలగిస్తున్నారు. రెండు ప్యాసింజర్‌రైళ్లలో సుమారు 1500 మంది ప్రయాణిస్తున్నట్టు రైలు అధికారుల అంచనా వేశారు..