తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ(AP)లో అంగన్వాడీ(Anganwadi)లు 26రోజులుగా సమ్మె చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలు చేస్తున్న నిరసనలకు అడ్డుకట్టవేసింది.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా(Essential Services Maintenance Act) ప్రయోగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీలను అత్యవసర సేవల కిందికి తీసుకొస్తూ జీవో నెంబర్ 2ను జారీ చేసింది. ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధించారు.
ఎస్మా ప్రయోగిస్తే తప్పకుండా విధుల్లో చేరాల్సి ఉంటుంది. లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. సమ్మె కాలానికి వేతనంలోనూ ప్రభుత్వం కోత విధించినట్లు అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.3వేలు తగ్గించి రూ.8,050 మాత్రమే ఖాతాల్లో జమ చేసినట్లు వాపోతున్నారు.
కొద్ది రోజులుగా అంగన్వాడీలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన ఏపీ ప్రభుత్వం పలు డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. అయితే అంగన్వాడీలు జీతాల పెంపు, గ్రాట్యుటీపై పట్టుబడుతూ సమ్మె కొనసాగిస్తుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా వారిని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంలో ఏపీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.