పంజాబ్(Punjab) రాష్ట్రం ఫరీద్కోట్(Fareedkot) లోని ఓ పరీక్షా కేంద్రంలో ఓ యువకుడు ఎవరూ ఊహించని పనిచేసి నవ్వులపాలయ్యాడు. ఆ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లు, అధికారులు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఓ యువకుడు తన ప్రియురాలికి బదులుగా పరీక్ష రాసేందుకు చేసిన విఫలయత్నమే దీనికి కారణం.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7వ తేదీన బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ పరీక్ష జరిగింది. కోట్కపురాలోని డీఏవీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఫజిల్కాకు చెందిన అంగ్రేజ్ సింగ్ అనే యువకుడు తన ప్రియురాలికి బదులుగా పరీక్ష రాసేందుకు యువతి వేషధారణలో వచ్చాడు.
లేడీస్ సూట్ వేసుకుని, ఎరుపురంగు గాజులు ధరించి, నుదుట తిలకం పెట్టుకుని, పెదాలకు లిప్‌స్టిక్ రాసుకుని అచ్చం అమ్మాయిలా తయారై వచ్చేసరికి ఎవరూ గుర్తించలేకపోయారు. పరీక్ష మొదలైంది.. అమ్మాయి వేషధారణలో దిగిన ఫొటోతో తన గర్ల్‌ఫ్రెండ్ పరంజీత్ కౌర్ పేరిట తయారు చేయించుకున్న నకిలీ గుర్తింపు కార్డులను కూడా అధికారులు పసిగట్టలేకపోయారు.
అయినా చివరికి అతని బండారం ఎలా బయటపడిందంటే.. ఇన్విజిలేటర్ ఒక్కొక్కరి దగ్గర బయోమెట్రిక్ తీసుకుంటూ అంగ్రేజ్ సింగ్ దగ్గరకు వచ్చాడు. అంగ్రేజ్ సింగ్ వేలిముద్రలు అసలు క్యాండిడేట్ పరంజీత్ కౌర్ వేలిముద్రలు వేరు కావడంతో సరిపోలలేదు. అంతేకాదు, అంగ్రేజ్ వేషం పకడ్బందీగా ఉండటంతో అప్పటికీ ఇన్విజిలేటర్‌కు అనుమానం రాలేదు. సాంకేతిక సమస్యేమోనని పైఅధికారుల దృష్టికి తీసుకుకెళ్లాడు.
వాళ్లు వచ్చి వేలిముద్రలు వేయించి చూసినా మ్యాచ్ కాలేదు. దాంతో అనుమానం వచ్చి తనిఖీ చేయడంతో తను అమ్మాయి వేషంలో వచ్చిన అబ్బాయి అని తేలింది. అది చూసి ఆ హాల్లో పరీక్ష రాస్తున్న మిగతా అభ్యర్థులతోపాటు ఇన్విజిలేటర్లు, అధికారులు నవ్వాపుకోలేక కష్టపడాల్సివచ్చింది. అంగ్రేజ్ను పోలీసులకు అప్పగించారు. పరంజిత్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు అధికారులు.