ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ(Anil Ambani)కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అంబానీ గ్రూప్(Ambani Group)లోని ఒక సంస్థకు అనుకూలంగా భారత ఉన్నత న్యాయస్థానం తీర్పుఇచ్చింది. దీంతో అంబానీ ఏకంగా రూ.8వేల కోట్లను కోల్పోయారు. 2008లో రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్(DAMEPL) , ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC) ఒక కన్సెషన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
2017లో ఇచ్చిన తీర్పు ప్రకారం.. డీఏఎమ్ఈపీఎల్కు డీఎంఆర్సీ రూ.2782.33 కోట్లు చెల్లించాలి. 2022 ఫిబ్రవరి 14 నాటికి ఒప్పంద నిబంధనల ప్రకారం ఇది రూ.8,009.38 కోట్లకు చేరింది. ఇందులో రూ.1678.42 కోట్లను డీఎన్ఆర్సీ చెల్లించింది. మరో రూ.6,330.96 కోట్లు చెల్లించాల్సి ఉంది. తాజా తీర్పుతో అనిల్ కంపెనీ రూ.1678.42 కోట్లను డీఎన్ఆర్సీకి వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రూ.6,330.96 కోట్లనూ వదులుకోవాల్సి ఉంటుంది.
దీనిపై వచ్చిన వివాదం విషయంలోనే డీఎన్ఆర్సీకి వ్యతిరేకంగా 2021లో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దానిపై డీఎన్ఆర్సీ దాఖలు చేసిన క్యూరేటివ్ విజ్ఞప్తిని అంగీకరించిన ప్రత్యేక ధర్మాసనం తాజాగా అనిల్ అంబానీకి వ్యతిరేకంగా తీర్పును వెల్లడించింది. డీఏఎమ్ఎస్ఈపీఎల్కు డీఎస్ఆర్సీలు రూ.8వేల కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా న్యాయస్థానం తీర్పునిచ్చింది.
ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ సరైన నిర్ణయమే తీసుకుందని, అందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టుకు ఎలాంటి కారణమూ కనిపించడం లేదని అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు అయింది. 2008లో ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న అనిల్ అంబానీ.. ప్రస్తుతం ఆ లిస్టులోనే లేరు. కొన్నేళ్లుగా ఆయనకు ఆర్థికంగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.