టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీకి ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ ఎడిషన్ చివరిదనే ప్రచారం జరుగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ ఎవరంటూ క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చలు మొదలైనాయి.. ఇదే సమయంలో మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు వెలువడుతున్నప్పటికీ అందుకు అతడు సిద్ధంగా లేడని తాను భావిస్తున్నట్టు మాజీ లెగ్ స్పిన్నర్ అభిప్రాయపడ్డారు..
కుంబ్లే, జియో స్పోర్ట్స్ (Jio Sports)తో మాట్లాడుతూ, ధోనీ ఐపీఎల్ 2024 సీజన్లో ఖచ్చితంగా ఆడగలడని, ఐపీఎల్ 2025లో సైతం కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఎంఎస్ ధోనీ అందరితో కలిసిపోవాలని కోరుకునే ఆటగాడని, ఈ విషయంలో ధోనీ, సచిన్ టెండూల్కర్ ఒకటేనని అనిల్ కుంబ్లే (Anil Kumble) పోల్చారు.. ఎంఎస్ ధోనీ (MS Dhoni)తో ఐపీఎల్ (IPL)లో తానెప్పుడూ ఆడలేదని అన్నారు.
అయితే భారత జట్టులో ఆడేటప్పుడు తనను పైకి లేపిన మొదటి వ్యక్తి ధోనీయే అని కుంబ్లే గుర్తుచేసుకొన్నారు. భారీ బరువు ఎత్తడంలో ధోనీ అత్యంత బలవంతుడని తాను భావిస్తున్నట్లు.. అతడు తనను గాల్లోకి ఎత్తిన క్షణాలు అద్భుతమైనవని కుంబ్లే తెలిపారు. ధోనికి ఐపీఎల్-2024 చివరి సీజన్ కాబోదని.. మరికొన్నేళ్లపాటు అతడికి లీగ్లో కొనసాగే సత్తా ఉందని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు.
ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పట్లో అలసిపోడంటూ 42 ఏళ్ల ధోనిని ఉద్దేశించికుంబ్లే ప్రశంసలు కురిపించాడు. కాగా మార్చి 22న ఐపీఎల్-2024 సీజన్ ఆరంభం కానుంది. సీఎస్కే- ఆర్సీబీ మధ్య చెపాక్లో తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కుంబ్లే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి..