సీఎం కేసీఆర్ (CM KCR) పై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై (Annamalai) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్ తన అవినీతితో రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ పాలన అవినీతికి మోడల్‌గా మారిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక వ్యక్తి.. ఒక కుటుంబం చుట్టూ తిరుగుతోందని ఆయన ఫైర్ అయ్యారు.
ఇది రాష్ట్రానికి మంచిది కాదన్నారు. కుటుంబ పాలన వల్లే శ్రీలంక నాశనమైందన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ చాలా వాగ్దానాలు చేశారని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నరేండ్లలో ఆరున్నర లక్షల కోట్లు అప్పులు చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 కోట్ల జనాభా ఉన్న తమిళనాడులో రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. అదే 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో రూ.6.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఒక మినీ ఇండియా లాగా ఉందని అన్నారు. ఇక్కడ అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని రవి కుమార్ యాదవ్ కు బీజేపీ టికెట్ ఇచ్చిందన్నారు. రవి కుమార్ యాదవ్ లాంటి ఒక మంచి వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. అంతకుముందు.. శేరిలింగంపల్లిలో బీజేపీ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో అన్నామలై పాల్గొన్నారు.
దేశమంతా ఇప్పుడు ప్రధాని మోడీ మోడల్ ను కోరుకుంటోందని చెప్పారు. బీజేపీ హయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ బీ టీమ్ అని, బీఆర్ఎస్ కు ఎంఐఎం బీ టీమ్ అని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు ఇన్సూరెన్స్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.