తెలంగాణ (Telangana) సీఎం ఎవరనేది కాసేపట్లో రివీల్ కానుంది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరు దాదాపు ఖాయమైనా.. అధిష్టానం అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను చూస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Sivakumar) సమావేశమయ్యారు. ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే కూడా పాల్గొన్నారు.
అరగంట పాటు వీళ్లంతా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపిన ఏకవాక్య తీర్మానాన్ని అధిష్టానానికి డీకే అందజేశారు. సమావేశం ముగిసిన వెంటనే ఖర్గే నివాసం నుంచి రాహుల్, కేసీ వేణుగోపాల్ వెళ్లిపోయారు. శివకుమార్ హైదరాబాద్ కు బయలుదేరారు. ఆయన ఇక్కడకు రాగానే అధిష్టానం నిర్ణయించిన సీఎం అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఖరారు చేయాలని రాహుల్ గాంధీ సూచించినట్టు సమాచారం. మొదట్నుంచి రేవంత్ పేరే ప్రముఖంగా వినిపిస్తున్నా.. కొందరి నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో అధిష్టానం ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.
ఇటు, 48 గంటలుగా గచ్చిబౌలి ఎల్లా హోటల్ లోనే రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఉన్నారు. హోటల్ నుంచే పార్టీ నేతలతో మంతనాలు, ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై మాట్లాడుకున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డిని కలిసి పలువురు అధికారులు శుభాకాంక్షలు చెబుతున్నారు. హోటల్ లో రేవంత్ ఉండే గది వద్ద భద్రతను పెంచారు పోలీసులు.