మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో ఛీతాల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘ధాత్రి’ అనే ఆడ ఛీతా బుధవారం మరణించింది.దీంతో గత మార్చి నుంచి ఇప్పటివరకు మరణించిన ఛీతాల సంఖ్య 9 కి చేరింది. నమీబియా నుంచి తెప్పించిన ఈ ఛీతా మరణానికి కారణం పోస్ట్ మార్టం అనంతరమే తెలుస్తుందని ఇక్కడి వర్గాలు వెల్లడించాయి. అంతరించిపోతున్న వీటి జాతిని వృద్ధి చేయాలన్న ప్రభుత్వ ధ్యేయం నీరుగారుతోందని అంటున్నారు. ప్రాజెక్ట్ ఛీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి రెండు విడతల్లో 20 ఛీతాలను ఇండియాకు తెప్పించారు. వీటిలో ధాత్రితో కలిపి ఆరు పెద్ద జంతువులు మృతి చెందాయి.
నమీబియా నుంచి తెప్పించిన ఛీతాకు నాలుగు కూనలు జన్మించగా.. పౌష్టికాహార లేమి, డీహైడ్రేషన్ వంటి వివిధ కారణాల వల్ల వీటిలో మూడు మరణించాయి. ఛీతాల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా ఇవి మృత్యు బాట పట్టడం పట్ల నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధులు, ఇవి ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం, ప్రమాదాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం వంటివి వీటి మృతికి కారణాలుగా వారు పేర్కొంటున్నారు.
రేడియో కాలర్లు కూడా ?
ఛీతాల కదలిక, వాటి మానిటర్ ను ట్రాక్ చేయడానికి వినియోగిస్తున్న రేడియో కాలర్లు కూడా వీటికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయని అంటున్నారు. వాటి మెడలకు కట్టిన రేడియో కాలర్లు వాటికి ప్రమాదంగా మారుతున్నాయన్నది ఓ వాదన. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ రేడియో కాలర్ల వల్ల ఛీతాలకు స్కిన్ ఇన్ఫెక్షన్ సోకుతోందని, తేమ కారణంగా వాటి మెడల వద్ద బ్యాక్టీరియా చేరి వాటిని గాయాలకు గురి చేస్తోందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ సోకి ఇవి మరణిస్తున్నాయని వారు విశ్లేషించారు.
జైరాం రమేష్ మండిపాటు
కునో నేషనల్ పార్క్ లో వరుసగా ఛీతాలు మరణిస్తుండడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. సైన్స్ కు, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే జరిగేది ఇదేనని ట్వీట్ చేశారు. ఓ వ్యక్తి గర్వం, వ్యక్తిగత ప్రతిష్టకు పెద్దపీట వేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఆయన పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.