గజ్వేల్ (Gajwel) ప్రజలకు సీఎం కేసీఆర్ (CM KCR) కీలక హామీ ఇచ్చారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ (BRS) సర్కార్ అధికారంలోకి వస్తే గజ్వేల్‌లో దళిత బంధును ఒక్క విడతలోనే అమలు చేస్తామని తెలిపారు. గజ్వేల్‌లో త్వరలోనే ఐటీ టవర్లు తీసుకు వస్తామని హామీల వర్షం కురింపించారు.
గజ్వేల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ… వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి తనకు 70 ఏండ్లు వస్తాయని అన్నారు. తెలంగాణ తీసుకు వచ్చిన కీర్తి తనకు చాలన్నారు. సీఎంగా ఇప్పటికే పదేండ్లు పని చేశానని తెలిపారు.
అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్ చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. ఈ సారి బీఆర్ఎస్ సర్కార్ వస్తే గజ్వేల్ నియోజక వర్గంలో అందరికీ దళిత బంధు ఇస్తామన్నారు. కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకు వచ్చి మల్లన్న సాగర్ ముంపు బాధితులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గజ్వేల్ కు ఐటీ టవర్లు తీసుకు వస్తామన్నారు.
ట్రిపుల్ ఆర్ పూర్తయితే గజ్వేల్ దశ మారిపోతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్ ఒక గొప్ప రోల్ మోడల్ గా మారిందన్నారు. గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడకు వస్తున్నారన్నారు. గజ్వేల్‌లో రెండు సార్లు తనను గెలిపించారని, మరోసారి ఆశీర్వదిస్తే కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ అభివృద్ధి చేసుకుందామన్నారు.