ఇండియన్ నేవీ మరోసారి తన సత్తాను చాటింది. అరేబియా సముద్రంలో(Arebian Sea) ఇటీవల కాలంలో హౌతీ రెబల్స్, సముద్రపు దొంగలు(Pirates) రెచ్చిపోతున్నారు. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీ రెబల్స్, సముద్రపు దొంగలు వాణిజ్య నౌకలు, ఫిషింగ్ బోట్లపై దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో దాడులు మరింత పెరిగాయి. దీంతో అరేబియన్ సముద్రంలో ఇండియన్ నేవీ(INDIAN NAVI) గస్తీని పెంచింది.
ఈ క్రమంలోనే ఇరాన్‌కు చెందిన ఓ నౌకపై సముద్రపు దొంగలు దాడి చేయగా వారిని బంధించి 23 మంది పాక్ పౌరులను కాపాడినట్లు భారతీయ నౌకాదళం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 28న ఇరాన్ ఫిషింగ్ నౌక ‘ఆల్ కంబార్’పై సముద్రపు దొంగలు దాడి చేశారు.
విషయం తెలుసుకున్న ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ సుమేధ, త్రిశూల్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్(RESCUE OPERATION) చేపట్టింది. సుమారు 12 గంటల పాటు శ్రమించి ఓడతో పాటు అందులోని పౌరులను కాపాడింది.ఓడలోని 9 మంది మంది సముద్రపు దొంగలను అరెస్టు చేసింది. యెమెన్ ద్వీపం -సోకోట్రాకు నైరుతి దిశలో సుమారు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఈ నౌక ఉన్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది.
గతేడాది డిసెంబర్ 14న గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో హైజాక్‌కు గురైన ఎంవీ రుయెన్ అనే నౌకను కూడా ఇండియన్ నైవీ రక్షించింది. సుమారు 40 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి 35 మంది సముద్రపు దొంగలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరేబియా, హిందూ సముద్రం గుండా భారత్ వాణిజ్య నౌకలు ఎక్కువగా తిరుగుతుండటంతో నేవీ గస్తీని టైట్ చేసింది.