పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్(BRS) పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీని కీలక నేతలు వీడుతున్న వేళ గ్రేటర్ పరిధిలో ముఖ్యనేతగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన మరెవరో కాదు.. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి.(Uppal Ex Mla Bethi SUbash reddy)
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుభాశ్ రెడ్డిని కాదని, బండారు లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే.ఆయన ఉప్పల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఇకపోతే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి తనను సంప్రదించకుండా పచ్చి అవకాశవాది అయిన రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆయన గులాబీబాస్, బీఆర్ఎస్ పార్టీ మీద గుర్రుగా ఉన్నారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రాగిడి లక్ష్మారెడ్డి అవకాశ వాదులకు పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేనని.. తన సహచర ఉద్యమకారుడు ఈటల రాజేందర్‌కు మద్దతిస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తన మీద ఎలాంటి మచ్చలేకపోయినా పార్టీ తనను పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంతకాలం పార్టీలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తన రాజీనామా లేఖను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపించారు.అయితే, ఆయన త్వరలోనే బీజేపీ చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుండగా.. తాజా పరిణామం ఆ పార్టీకి ఊహించని పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు