ఏపీ(AP)లో పొలిటికల్ హీట్(Political Heat) పెరుగుతోంది. వచ్చే ఫిబ్రవరిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో వైసీపీ, టీడీపీ-జనసేన నేతలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ(TDP) ఫోకస్ పెట్టింది. జనవరిలో మొదటి విడత అభ్యర్థులను ప్రకటించే విధంగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
‘విజన్ 2024.. మిషన్ 175..’ లక్ష్యంతో టీడీపీ, జనసేన అధినేతలు ముందుకెళ్తున్నారు. తాజాగా చంద్రబాబు 50 మందితో కూడిన తొలి జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు టిక్ చేసిన ఆ 50మందిలో టికెట్ దక్కేదెవరికో అని సస్పెన్స్‌గా మారింది. అందులో జనసేనకు ఎన్ని టికెట్లు ఇస్తారో? అని చర్చ నడుస్తోంది. జనసేనతో సర్దుబాటు చేసుకునే సీట్లను పక్కనపెట్టి కొన్ని స్థానాలకు అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
గ్రూపు గొడవలు లేని స్థానాలపై ముందుగా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే పొత్తులో భాగంగా టీడీపీ-జనసేన సమన్వయ కమిటీలు గ్రౌండ్ లెవల్ యాక్టివయ్యాయి. ఇటు పవన్-అటు చంద్రబాబు తమ తమ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. ముందు కలిసి నడుద్దాం. కలబడి నిలబడుదాం.. గెలుద్దాం.. ముఖ్యమంత్రి ఎవరనే ముచ్చట మేమిద్దరం చూసుకుంటామని క్యాడర్‌కు క్లారిటీ ఇచ్చారు పవన్.
గతానికంటే భిన్నంగా అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా దృష్టిసారించారు చంద్రబాబు. గత మూడు నెలలుగా క్షేత్ర స్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితితో పాటు అభ్యర్థులకు సంబంధించి గెలుపోటములపైనా స్వయంగా నివేదికలు తెప్పించుకుంటున్నారు.. ఎక్కడైనా ఒకరికంటే ఎక్కువమంది అభ్యర్థులు టికెట్ ఆశిస్తే ఆయా నేతల గురించి నివేదికలు తెప్పించుకుంటున్నారు.
ఇటీవల చంద్రబాబు-పవన్ భేటీలో సీట్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రెండు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాలు, సామాజిక వర్గాల ప్రకారం గెలిచే సీట్లను పక్కనపెట్టి మిగిలిన సుమారు 50 స్థానాలకు జనవరిలో తొలి జాబితా ప్రకటించేలా చంద్రబాబు ముందుకెళ్తున్నారనేది టాక్. జనవరి కల్లా జాబితాను విడుదల చేసి అందులో చోటు ఎవరికి? వేటు ఎవరికి? పొత్తులో భాగంగా సర్దుబాట్లు ఎక్కెడెక్కడ? అనేది ఆసక్తికరంగా మారింది.