ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ఓ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళన పరిస్థితి నెలకొంది.
జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి రీయింబర్స్మెంట్ ఇచ్చామని గవర్నర్ చెబుతుండగా టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. పూర్తి రీయింబర్స్మెంట్ అంతా అబద్ధమంటూ తెలుగుదేశం సభ్యులు నిరసనకు దిగారు. అదేవిధంగా17 ప్రభుత్వ ఆసుపత్రులు కొత్తగా ప్రవేశపెట్టామని చెబుతుండగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ప్రతిపక్షాలు నినాదాలు చేశారు. కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే వెంటనే గవర్నర్ కల్పించుకుని తనకు త్రోట్ ఇరిటేషన్ ఉందని చెప్పడంతో టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. అంతకుముందు టీడీపీ నేతలు అసెంబ్లీలోకి నిరసన తెలుపుతూ ర్యాలీగా వచ్చారు.
టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనగా వస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి తర్వాత ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను బారికేడ్లు పెట్టి మరీ పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో బారికేడ్లు తోసుకుంటూ ప్లకార్డులు చేతపట్టి కాలినడకన అసెంబ్లీకి చేరుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అసెంబ్లీకి వెళ్లే వారిని అడ్డుకోవడం దిక్కుమాలిన చర్య అని మండిపడ్డారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు.