ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు-2024(AP Assembly Budget Sessions-2024) మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రైతు సమస్యలపై టీడీపీ(TDP) ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారం తిరస్కరించారు. దీంతో పోడియం వద్ద టీడీపీ సభ్యులు మరోసారి ఆందోళనకు దిగారు.
టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం ఎక్కారు. మళ్లీ కాగితాలు చించి స్పీకర్‌పై విసిరారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు. మంగళవారం ఇలాగే ఆందోళన చేస్తూ స్పీకర్‌పై పేపర్లు విసరడంతో ఒకరోజు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే.
అంతకుముందు టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే సభలో పలు బిల్లులకు ఆమోదం తెలిపారు. ఆర్జేయూకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు-2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్ బిల్లు -2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు-2024కు అసెంబ్లీలో ఆమోదించారు.
కాగా, ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ప్రజలకు చేసిన మంచిని చెప్తుంటే వినలేక వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి మీడియాలో కనిపించాలనే తాపత్రయంతో గందరగోళం సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ విఫల ప్రతిపక్షం మంటూ వ్యాఖ్యానించారు.