టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ను అరెస్టు చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ సీఐడీ(CID) ఏసీబీ కోర్టు(ACB Court)లో పిటిషన్ దాఖలు చేసింది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను లోకేశ్ ఉల్లంఘించినట్లు పిటిషన్‌లో పేర్కొంది.
164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం నమోదును లోకేశ్ తప్పుబట్టడంపై న్యాయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సాక్ష్యులను బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్టించాలని లోకేశ్ ఉద్దేశంగా సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది. ఇప్పటికే 2 సార్లు లోకేశ్ విచారణకు హాజరయ్యారు.
ఐఆర్ఆర్ కేసులో గతంలోనే సీఐడీ లోకేశ్‌కు 41ఏ కింద నోటీసులు ఇచ్చింది. ఐఆర్ఆర్ కేసులో ఏ14గా లోకేశ్ ఉన్నారు. వాంగ్మూలాలు ఇవ్వడాన్ని లోకేశ్ తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అధికారులు 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని.. రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశానని, తమప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేశ్ హెచ్చరించారు.
ఈ మేరకు చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సీఐడీ కోర్టుకు అందజేసిన పిటిషన్‌లో పేర్కొంది. అందులో ఉన్న ప్రకటనలు సీరియస్‌గా పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకి పంపిస్తామని లోకేశ్ బెదిరించడంపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.