కృష్ణా జలాల అంశంపై బీఆర్ఎస్ (BRS)-కాంగ్రెస్ మధ్య పెద్ద వార్ నడుస్తోంది. జల దోపీడికి కారణం కేసీఆర్ (KCR) అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నిప్పులు చెరిగారు. చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారని…. పదవులు, కమీషన్లకు లొంగి పోయి జల దోపిడీకి సహకరించారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ నుంచి జలాలను కిందకు వదిలితే తప్ప ఏపీకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ తెలిపారు. అలాంటి సమయంలో తాము కోరిన వెంటనే సీఎం కేసీఆర్ ఏపీకి నీళ్లు వదిలారని వెల్లడించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో తాము కేసీఆర్ కు విజ్ఞప్తి చేయగా వెంటనే పెద్ద మనుసు చేసుకుని ఆయన నీళ్లు వదిలారన్నారు.
ఓ వైపు కృష్ణా జలాల సాధన కోసం ఈ నెల 13న నల్గొండలో ఛలో నల్గొండ సభకు బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ ఆత్మ రక్షణలో పడింది. ఇప్పటి దాకా కృష్ణా జలాల అంశంపై కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏం చెబుతారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే నాగార్జున్ సాగర్ ప్రాజెక్టును సీఎం జగన్ తన ఆధీనంలోకి తీసుకుంటుంటే కేసీఆర్ నిమ్మక్క నీరెత్తినట్టు చూశారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఏపీకి నీళ్లను వదిలేందుకు స్వయంగా కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనే అంతా ఆసక్తిగా చూస్తున్నారు.