సీఎం జగన్ (CM Jagan)పై టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Nara Lokesh) సీరియస్ కామెంట్స్ చేశారు.. జగన్ ప్రభుత్వంపై యుద్ధం మొదలైందని అన్నారు. మద్యం దుకాణాలు తీసేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేశారని ఆరోపించారు. ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు, చివరకు మద్యం ధర కూడా పెంచి పేదల బతుకులను నాశనం చేశారని మండిపడ్డారు.
మరోవైపు పలువురు వైసీపీ (YCP) నుంచి టీడీపీలో చేరారు. వారికి నారా లోకేశ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా.. మంగళగిరి (Mangalagiri)లో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురుతుందని వెల్లడించారు. మంగళగిరి నియోజకవర్గానికి నిధులు కేటాయించినప్పటికీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని జగన్ ప్రభుత్వంపై లోకేశ్ ఫైర్ అయ్యారు.
ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో ఫేక్ పట్టాలు సృష్టించి కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ మొత్తం మంగళగిరి వైపే చూసేలా బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా నారా లోకేశ్ హామీ ఇచ్చారు. కాగా 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందు మంగళగిరి సీటు కేటాయించడం.. సమయం ఎక్కువగా లేకపోవడం వల్ల ప్రజల సమస్యలు పూర్తిగా అర్దం చేసుకోలేకపోయానని తెలిపారు.
అప్పుడు ఉన్న అతి తక్కువ సమయంలో నేనేంటనేది ప్రజలకు అర్దం కాలేదని అందుకే ఓడిపోయానని వెల్లడించిన లోకేష్.. ఆ ఓటమే నాలో కసి పెంచింది. ప్రజల కోసం ప్రజలతోనే కలిసి నడిచేలా చేసిందని అన్నారు. గతంలో ఓడిన అభ్యర్దులు ఎవరూ ఇలా ప్రజలకు సేవ చేయలేదు. నేను ఓడిపోయినా ప్రభుత్వానికి ధీటుగా ఇక్కడే సేవా కార్యక్రమాలు చేశానని తెలిపారు.