కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Sha) ఆధ్వర్యంలో నిర్వహించిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (AP CM) వైయస్ జగన్ (YS Jagan) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గడిచిన నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై ఆంధ్రప్రదేశ్ (AP) పోరాడుతోందని, కేంద్ర హోంమంత్రిత్వశాఖ మద్దతుతో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలనూ తీసుకుంటోందని అన్నారు. వైసీపీ (YCP) ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు.
మావోయిస్టు తీవ్రవాద బలం 2019 నుంచి 2023 నాటికి 150 నుంచి 50 కి తగ్గిందని పేర్కొన్నారు. అలాగే ఆపరేషన్ పరివర్తనలో భాగంగా తీసుకొన్న చర్యల వల్ల గంజాయి సాగు 45 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. గంజాయి సాగు చేసే గిరిజనుల ఆలోచనా విధానంలో మార్పు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని అన్నారు.
గంజాయి సాగు చేయకుండా గిరిజనులకు ఉపాధి కల్పించే దిశగా ప్రత్యామ్నాయ పంటలైన కాఫీ, నిమ్మ, జీడి మామిడి, నారింజ, కొబ్బరి, చింతపండు, సిల్వర్ ఓక్‌తో పాటు రాజ్మా, కందిపప్పు, వేరుశనగ వంటి పంటల సాగును ప్రోత్సహిస్తూన్నట్టు వెల్లడించారు. ఇవే కాకుండా తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి చేపడుతోన్న ఎన్నో చర్యలను ఈ సందర్భంలో తెలియచేశారు వైయస్ జగన్..