ఇటీవల కాలంలో భార్యాభర్తలు చిన్నచిన్న విషయాలకే గొడవ పడి విడిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. పెళ్లి చేసుకొని ఏడాది గడవకముందే విభేదాల కారణంగా కొందరు కోర్టు మెట్లు ఎక్కుతుండగా మరికొందరు మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, పెళ్లైన నెలరోజుల్లోనే ఓ యువ జంట అలాంటి కఠిన నిర్ణయమే తీసుకుంది.
నెల రోజుల కిందంటే పెళ్లి చేసుకున్న ఓ యువ జంట అందరూ చూస్తుండగానే సముద్రంలోకి వెళ్లింది. వెనక్కి రావాలంటూ అక్కడున్నవాళ్లు ఎంత అరిచినా పట్టించుకోకుండా వెళ్లి గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ(B.R.Ambedkar Konaseema) జిల్లా సఖినేటిపల్లి(Sakinetipally Police Staion) పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రిలకు నెల రోజుల కిందట వివాహమైంది. అయితే ఈ నవదంపతులు కార్తీకమాసం సందర్భంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటామని ఇంటి దగ్గర చెప్పి బయటకు వచ్చారు. అంతర్వేది బీచ్ సమీపంలో ఇద్దరూ చేతులకు చున్నీ కట్టుకుని అందరూ చూస్తుండగానే సముద్రంలో 500 మీటర్ల దూరం వరకు వెళ్లారు.
ఇదిచూసిన బీచ్ ఉన్నవారు వారిని వారించే ప్రయత్నం చేశారు. వెనక్కి రావాలంటూ కేకలు వేశారు. అయినా ఆ దంపతులు వినిపించుకోకుండా సముద్రంలో కలిసిపోయారు. దీంతో స్థానికులు సమీపంలో ఉన్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఆ యువ జంట ఆచూకీ లభించలేదు. సముద్రం ఒడ్డున వదిలిన సెల్ఫోన్ ఆధారంగా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.