ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైసీపీ(YCP) నాయకుల్లో గుబులు మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్దఎత్తున మార్చాలని ఏపీ సీఎం(AP CM), వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) కసరత్తు చేస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అధికార వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. అయితే, తాజాగా మంత్రి జోగి రమేశ్ రియాక్ట్ అయ్యారు. ‘‘సమర్థుడైతేనే టికెట్ ఇస్తారని.. లేదంటే ఇవ్వరు.. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా గీత దాటను.. పెడనలో పోటీ చేయమంటే చేస్తా.. మైలవరం వెళ్లమంటే వెళ్తా.. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే ఉంటా..’ అంటూ మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు.
అదేవిధంగా మంగళవారం తిరుమల శ్రీవారి దర్శించుకున్న ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. కొంతమంది పనిగట్టుకుని తనకు టికెట్ రాదంటూ ప్రచారం చేస్తూ శునకానందాన్ని పొందుతున్నారని మంత్రి రోజా విరుచుపడిన విషయం తెలిసిందే.
‘సీటు ఇవ్వకపోయిన ఇబ్బందేమి లేదు.. నేను జగనన్న సైనికురాలినని.. జగనన్న కోసం ప్రాణాలైన ఇవ్వడానికి రెడీగా ఉన్నా.. నగరి టికెట్ ఎవరికి వచ్చినా ఇబ్బందేమీ లేదు..’ అంటూ మంత్రి రోజా తెలిపారు. తనకు సీటు ఉందో లేదో నన్న విషయం కార్యకర్తలకు, నాయకులకు తెలుసని వెల్లడించారు.