తిరుమల (ttd) నడక దారిలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన నేపథ్యంలో నడకమార్గంలో కంచె ఏర్పాటు చేయాలంటూ బీజేపీ(bjp) నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆగష్టు 11న తిరుమల నడక మార్గంలో కొండపైకి వెళుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన బాలికపై చిరుత దాడి చేసి చంపేయడంతో రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని కోరుతూ బీజేపీ నాయకుడు హైకోర్టు (ap highcourt) పిల్ దాఖలు చేశారు.
తిరుమల మెట్ల మార్గంలో ఇనుప కంచె ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని పిటిషన్‌లో భానుప్రకాష్ పేర్కొన్నారు. ఈ అంశంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. భక్తుల భద్రతకు అలిపిరి నుంచి తిరుమలకు ఇనుప కంచె వేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వానికి,టీటీడీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బాలిక కుటుంబానికి మరో రూ.15 లక్షలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించింది. భక్తుల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని టీటీడీ, అటవీ శాఖకు హైకోర్టు ఆదేశించింది.
ఇటీవల చిరుత దాడిలో మరణించిన ఆరేళ్ల బాలిక లక్షితకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖలు విడివిడిగా పరిహారం చెల్లించాయి. బాలిక కుటుంబానికి ఇప్పటికే రూ.15 లక్షలు ఇచ్చినట్లు హైకోర్టుకు టీటీడీ, రాష్ట్రప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.
మరోవైపు తిరుమల కొండలు అటవీ శాఖ పరిధిలో ఉండటంతో అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని టీటీడీ చెబుతోంది. వన్యప్రాణుల రాకపోకలకు అటంకం కలిగించేలా శాశ్వత నిర్మాణాలు చేపట్టడంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుందని, కందకాలు, ఫెన్సింగ్ వంటి నిర్మాణాలతో ఫలితాలపై, ప్రతికూలతలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశంపై కసరత్తు చేయనున్నారు.