ఎట్టకేలకు వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) అధికారికంగా రాజీనామా చేశారు. ఇంతకాలం పాటు వైసీపీ (YCP)లోనే ఉంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కి కంటిలో నలుసులా మారిన ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపించారు.
ఈ విషయాన్ని తన ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించారు. తన రాజీనామా లేఖలో ఆ ట్వీట్‌లో జతచేశారు. అయితే రఘురామ తన పదవికి సైతం రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆయన తన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకునే లేదని.. పదవికి రాజీనామా చేయబోనని ఇప్పటికే చెప్పేశారు. ఈ క్రమంలోనే రఘురామ కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని, విపక్ష కూటమి నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు కూడా వెల్లడించారాయన. అయితే ఏ పార్టీ టికెట్ పై బరిలో ఉంటారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. ఫిబ్రవరి 28న టీడీపీ – జనసేన సంయుక్తంగా తాడేపల్లిగూడెంలో జరిగే భారీ బహిరంగ సభలోనూ పాల్గొంటానని తెలిపారు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన రఘురామ కృష్ణరాజుకు.. కొద్దిరోజులకే అధిష్టానం తీరు నచ్చక పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. సీఎం జగన్ ప్రతి ఆలోచననూ ఆయన ఖండిస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తి చూపడంతో ఆయన్ను నియోజకవర్గంలో తిరగనివ్వమని వైసీపీ శ్రేణులు హెచ్చరించడంతో ఢిల్లీ, హైదరాబాద్ కే పరిమితమయ్యారు.
I hereby tender my resignation for the primary active membership of YSRC Party. pic.twitter.com/IFyNkV1RO2
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) February 24, 2024