మద్యం కుంభ కోణం కేసు ఢిల్లీ సీఎం(Delhi CM), ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal)కు పెను సవాల్‌గా మారింది. ఒకవైపు కేజ్రీవాల్‌ను విడుదల చేయాలంటూ ఆప్ నేతలు నిరసనలు చేపడుతుంటే బీజేపీ శ్రేణులు మాత్రం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ పరిణామాల నడుమ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తున్నారు. ఆయన నిర్బంధ సమయంలోనే ఇటీవల ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన తన మొదటి ఉత్తర్వును జారీ చేశారు. తాజాగా కేజ్రీవాల్ జైలు నుంచి మరో ఉత్తర్వును జారీ చేశారు. ఇప్పటికే కస్టడీ నుంచి తొలిసారి ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
మంగళవారం ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ ఆరోగ్యశాఖకు సంబంధించి ఆయన రెండో ఆదేశం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేజ్రీవాల్ జారీ చేసిన ఆదేశాలను ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చదివి వినిపించారు. జైలులో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజల ఆరోగ్యంపై కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ విషయంపై తనకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
ఢిల్లీలోని కొన్ని ఆస్పత్రుల్లో, మొహల్లా క్లినిక్‌ల్లో ప్రజలకు ఉచిత మందులు అందుబాటులో లేవని, వాటిని అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. కొన్ని ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు కూడా నిర్వహించడం లేదని ఈ సమస్యలను పరిష్కరించాలన్నారని ఆరోగ్యమంత్రి చెప్పుకొచ్చారు. మరోవైపు, కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ నేతలు చేపట్టిన ప్రధాని మోడీ నివాసం ముట్టడిలో ఉద్రిక్తత నెలకొంది.
ఈ నేపథ్యంలో పంజాబ్ మంత్రితో సహా పలువురు ఆప్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు ప్రధాని మోదీ నివాసం చుట్టూ పలు అంచెల్లో పోలీసులు మోహరించారు. అటు వైపు ఎవరూ రాకుండా 144 సెక్షన్ విధించారు. ఆప్ కార్యకర్తలు వచ్చే అవకాశమున్న ఢిల్లీలోని పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. అలాగే మూడు మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేశారు.
నిరసనల కారణంగా సెంట్రల్ ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచించారు. ఇదిలా ఉండగా మరోవైపు కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు దిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో నిరసలు చేపట్టారు.