మద్యం పాలసీ కేసుకు సంబంధించి నేటి ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) డుమ్మా కొట్టారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో ఇవాళ(డిసెంబర్ 21) ఈడీ ఎదుట హాజరు కావాలని డిసెంబర్ 18న కేజ్రీవాల్‌కు ఈడీ(ED) సమన్లు ఇచ్చింది.
డిసెంబర్ 30 వరకూ పంజాబ్(Punjab)లోని హోషియార్‌పూర్ జిల్లాలోని ఆనంద్‌గఢ్ గ్రామంలో జరిగే విపాసన కోర్సుకు ఆయన హాజరు కానున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ తెలిపారు. కేజ్రీవాల్ 10 రోజుల పాటు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటారని వెల్లడించారు.
సమన్లు వచ్చిన రోజే కేజ్రీవాల్ అరెస్ట్ కావొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ సమన్ల వెనుక రాజకీయ ప్రేరణ ఉందని, వీటిని ఉపసంహరించుకోవాలని కూడా కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈడీ రెండోసారి ఆయనకు సమన్లు జారీ చేయడం గమనార్హం.
విపాసన సెషన్‌లో పాల్గొనడానికి కేజ్రీవాల్ మంగళవారమే బయలుదేరాల్సింది. కానీ, ‘ఇండియా కూటమి’ సమావేశం నేపథ్యంలో ఆయన తన షెడ్యూల్‌ను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. ఇదివరకే కేజ్రీవాల్‌ను నవంబర్ 2వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే.. ఈ సమన్లను చట్టవిరుద్ధంగా పేర్కొంటూ ఆయన విచారణకు వెళ్లలేదు.