ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలవంతపు చర్యలకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరారు. పిటిషన్లో విచారణకు సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఈడీ (ED)కఠిన చర్యలు తీసుకోకూడదని అన్నారు.
ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సురేశ్ కైత్ నేతృత్వంలోని ధర్మాసరం ఇవాళ ఈ కేసుపై విచారణ జరపనుంది. ఢిల్లీ ఎక్సైజ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటి వరకూ తొమ్మిది సమన్లు పంపింది. అయితే, వాటన్నింటిపై కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. తొమ్మిదోసారి మార్చి 21న (నేడు) విచారణకు పిలిచింది.
కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరిలు వాదించారు. పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ సమర్పించిన సమన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆయనకు కోర్టు నుంచి తక్షణ ఉపశమనం లభించలేదు. ఢిల్లీ హైకోర్టు ఈడీ నుంచి సమాధానం కోరగా, రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇవాళ(గురువారం) కేజ్రీవాల్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. సమన్ల దాటవేతపై ఈడీ కేసు నమోదు చేసింది. పాలసీ రూపకల్పన, ఖరారు కాకముందే జరిగిన సమావేశాలు, లంచం తీసుకున్నారనే ఆరోపణలు సహా పలు అంశాలపై ఈ కేసులో ఆప్ చీఫ్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఈడీ కోరుతోంది. దీనిపై కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు ఈడీ సమాధానం చెప్పాలని కోరింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 22న కోర్టు చేపట్టనుంది.