ఢిల్లీ సీఎం(Delhi CM) అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) జైలు నుంచి ప్రజలకు సందేశం పంపారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మంగళవారం (ఏప్రిల్ 16) తెలిపారు. ‘నా పేరు అరవింద్ కేజ్రివాల్, నేను ఉగ్రవాదిని కాను’ అని అందులో పేర్కొన్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్‌ను మీరు ఉగ్రవాదుల్లా చూస్తున్నారు మీకు సిగ్గులేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ ఎక్సెజ్ పాలసీ కేసులో అరవింద్ కేజీవాల్ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మార్చి 21న అరెస్టు అయిన విషయం తెలిసిందే. దీని తర్వాత కోర్టు ఆయనకు రెండు వేర్వేరు విచారణలో ఏప్రిల్ 1 వరకు ఈడీ రిమాండ్‌కు పంపింది. ఏప్రిల్ 1 న కోర్టు ఆయనను 15రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తీహార్ జైలుకు పంపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏప్రిల్ 15న మరోసారి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనను ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఈ క్రమంలో కేజ్రీవాల్ లేఖ ద్వారా పార్టీ శ్రేణులకు పలుమార్లు సందేశాలు పంపిస్తున్నారు. తాజాగా కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఉద్దేశిస్తూ ఆప్ నేత సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ను 24గంటలు సీసీటీవీ నిఘాలో ఉంచుతున్నారని, ఆయనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో ప్రధాని మోడీ దురుద్దేశం వ్యక్తమవుతోందని ఆరోపించారు. కనీసం కేజ్రీవాల్ కుటుంబంతో ములాఖత్‌ను కూడా అద్దాల గోడ ద్వారా ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్‌పై విద్వేషంతోనే ఇలాంటి ఇబ్బందికర చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు జడ్ ప్లస్ భద్రత ఉన్నదని అలాంటప్పుడు కేజ్రీవాల్‌ను ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్‌ను, ఆయన కుటుంబాన్ని అవమానించారని సంజయ్ సింగ్ అన్నారు. ఆయనను ఒక క్రిమినల్‌గా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మట్టిలో పుట్టిన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ప్రజా సేవ కోసం ఐఆర్ఎస్ సేవను విడిచిపెట్టారని, కిందకు లాగాలని చేసే ప్రయత్నాలు ఆయనను మరింత బలవంతున్ని చేస్తాయని అన్నారు.