కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarai Vijayan)కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో కనీస ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం దృష్టికి కిషన్ రెడ్డి తీసుకు వెళ్లారు. అందువల్ల భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సీఎంను ఆయన కోరారు. ఈ విషయంలో కేంద్రం నుంచి పూర్తి సహకారం అదింస్తామని తెలిపారు.
అయ్యప్ప భక్తులు మండల దీక్ష తర్వాత శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం హిందు ధర్మం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని వెల్లడించారు. ప్రతి యేటా నవంబర్-జనవరి మధ్య పలు రాష్ట్రాల నుంచి సుమారు కోటికి పైగా మాలధారులు, భక్తులు
శబరిమలకు వస్తున్నారని చెప్పారు.
ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి 15 లక్షలకు మందికి పైగా భక్తులు వస్తుంటారని అన్నారు. కానీ ఈసారి అయ్యప్ప సన్నిధానంలో సరైన ఏర్పాట్లు లేని కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు మీడియా, భక్తుల ద్వారా తెలుస్తోందన్నారు. ఇటీవల దర్శనం సందర్భంగా కనీస ఏర్పాట్ల లేమితో తొక్కిసలాటలో ఓ బాలిక మరణించిన విషయం తెలిసి తాము చాలా బాధపడ్డామన్నారు.
ఇలాంటి నేపథ్యంలో భక్తుల కోసం ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయాలని కోరారు. తగిన సంఖ్యలో ఉద్యోగులు, ఇతర సిబ్బందిని శబరిమలలో మోహరించాలని విజ్ఞప్తి చేశారు. శబరిమలపై, భక్తుల పాదయాత్ర చేసే మార్గాల్లో భోజనం, తాగునీరు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారను. ఈ విషయంలో స్వచ్ఛంద సేవాసంస్థల సహాయాన్ని కూడా తీసుకోవాలన్నారు. ఈ విషయంలో వీలైనంత త్వరగా, ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు.