– తుది అంకానికి తెలంగాణ ఎన్నికలు
– 119 నియోజకవర్గాల్లో ఏర్పాట్లు
– ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు సిబ్బంది
– రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు
– ఎన్నికల విధుల్లో 1.85 లక్షల మంది సిబ్బంది
– ఉదయం ఐదున్నరకే మాక్ పోలింగ్
– ఉ.7 గంటల నుంచి సా.5 వరకు సాధారణ ఎన్నిక
– నక్సల్స్ ప్రభావిత 13 స్థానాల్లో సా.4 గంటల వరకే పోలింగ్
– రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు
– బరిలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు
– గెలుపు ధీమాలో ఉన్న ప్రధాన పార్టీలు
– ఇప్పటికే 4 రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి
– డిసెంబర్ 3న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
తెలంగాణ (Telangana) ఎన్నికల యుద్ధం చివరి దశకు చేరుకుంది. నేతల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు కూడా రెడీ అయ్యారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుండగా… అధికారులు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. నక్సల్స్ ప్రభావిత 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఎన్నికల అధికారులు అన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కా ప్లాన్ చేశారు.
బుధవారం పోలింగ్ సామగ్రిని తీసుకుని అధికారులు తమకు కేటాయించిన కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు. దీని కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్టిబ్యూష్రన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సిబ్బంది తమకు కేటాయించిన సామగ్రిని కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును ఫెసిలిటీ సెంటర్ లో కూడా వినియోగించుకోవచ్చని ఉన్నతాధికారులు తెలిపారు. గురువారం ఉదయం ఐదున్నరకే మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ సమయానికి అభ్యర్థుల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. పోలింగ్ ఏజెంట్లు ఈవీఎంలను టచ్ చేయడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందరి సమక్షంలో మాక్ పోలింగ్ జరిగిన తర్వాత ఉదయం 7 గంటలకు సాధారణ పోలింగ్ పక్రియ మొదలవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 1.85 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్లను ఎన్నికల సంఘం నియమించింది. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్రంలోని అన్ని డీఆర్సీ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించారు. కలెక్టర్ అనుదీప్ హైదరాబాద్ పరిధిలోని డీఆర్సీ కేంద్రాలను సందర్శించారు.
ఇక, ఓటరు స్లిప్ లను గుర్తింపు కార్డుగా పరిగణనలోకి తీసుకోమని.. ఓటర్ ఐడీ కానీ వేరే ఇతర 12 రకాల ఐడీల్లో ఏదో ఒకటి ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. స్లిప్పులపై ఎలాంటి గుర్తులు ఉండటానికి వీల్లేదని చెప్పింది. అలాంటి వాటిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తామని లేకుంటే తిరస్కరిస్తామని పేర్కొంది. ఓటు వేసేందుకు వచ్చిన వాళ్లు ఎవరూ ఫోన్లు తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఓట్లు వేసినప్పుడు సెల్ఫీలు, ఇతర ఫొటోలు తీయడానికి కూడా వీల్లేదని చెబుతున్నారు. అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్లు కచ్చితంగా శిక్షార్హులు అవుతారని హెచ్చరిస్తున్నారు.
మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల భద్రతా విధుల కోసం రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను కూడా అధికారులు రంగంలోకి దించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయ్యింది. గురువారం తెలంగాణలో కూడా ముగియనుంది. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి డిసెంబర్ 3న ఓట్లను లెక్కింపు ఉంటుంది.