ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) లో పర్యటించిన కొద్ది రోజుల తర్వాత.. చైనా (China)తన కుటిల బుద్ధిని చాటుకొంది. కొత్త వేషాలకు డ్రాగన్ తెరతీసింది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న విషపు దేశానికి భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్ విడదీయరాని భాగమని తేల్చి చెప్పింది.

ఇది తమ భూభాగమేనని చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన రాష్ట్రాన్ని తాము ఎప్పటికీ గుర్తించబోమని డ్రాగన్ విషం కక్కింది. జిజాంగ్ తమ భూభాగమేనని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా అరుణాచల్ ప్రదేశ్‌కు, జిజాంగ్ అని చైనా నామకరణం చేసుకొంది. భారత్ చేపడుతున్న చర్యలు సరిహద్దు వెంబడి శాంతిస్థాపనకు అనుకూలం కాదని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఝాంగ్ షియాంగాంగ్ అన్నారు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం రక్షించుకునే క్రమంలో తాము నిత్యం అప్రమత్తంగా ఉంటామని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో చైనా చేసిన వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇక రక్షణ శాఖ బలోపేతం పై దృష్టి సారించిన కేంద్రం.. అరుణాచల్ ప్రదేశ్‌లో సరిహద్దు వెంబడి సెలా టన్నెల్ నిర్మించింది. దేశభద్రత రీత్యా13 వేల అడుగుల ఎత్తున, పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. ఈ టన్నెల్ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.