వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్(Aruri Ramesh) బీఆర్ఎస్ను వీడి భారతీయ జనతా పార్టీ(BJP) లో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ అధిష్టానం ఆయనకు వర్ధన్నపేట(Vardhannapet) నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సంచలన ఆరోపణలు చేశారు. తాను బీఆర్ఎస్ పదేళ్లుగా ప్రజల కష్టసుఖాల్లో తోడున్నానని, అయితే సొంత పార్టీలోనే ద్రోహులు కుట్రలు చేశారని మండిపడ్డారు.
బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుట్రలకు బలయ్యామని ఆరోపించారు. మంత్రి పదవికి అడ్డువస్తానని తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మూడో సారి తాను గెలవకుండా కొందరు ద్రోహులు కుట్రలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను మాల, మాదిగలకు అందకుండా కడియం కుట్రలు చేశారంటూ మండిపడ్డారు. తమను బయటకు పంపి చివరకు పార్టీకి మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అంటూ ధ్వజమెత్తారు.
దళితులను ఇబ్బంది పెట్టిన కడియంకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కడియం కావ్య అత్తగారు గుంటూరు అని, ఓరుగల్లు ప్రజలకు గుంటూరు కోడలు కావాలా? లేక ఓరుగల్లు బిడ్డ కావాలా? ఆలోచించాలన్నారు. గుంటూరు వ్యక్తికి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. దేశ ప్రజలు మోడీని మూడోసారి ప్రధాని చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశ రక్షణ, ధర్మం, న్యాయం కోసం మోడీ పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి చేసింది బీజేపీనే అని చెప్పుకొచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ, మామ్నూర్ ఎయిర్పోర్టు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేని స్పష్టం చేశారు.