ప్రజా శ్రేయస్సు కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధంగా ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయడంతో తమ పార్టీ ప్రజాదరణ పొందిందని కేజీవాల్ గుర్తుచేశారు. దేశంలోని ఏ ఇతర పార్టీలు దృష్టి సారించని సమస్యలపై తమ పార్టీ దృష్టి కేంద్రీకరించిందని అన్నారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు.
కేంద్రంలోని బీజేపీ దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని తమ పార్టీ నేతలను జైలుకు పంపిందని ఆరోపిస్తూ కేజ్రీవాల్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న పార్టీ నేతలను చూస్తే గర్వంగా ఉందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. పిల్లలకు ఉన్నతమైన విద్య, పేదలకు ఉచిత వైద్యం గురించి మాట్లాడితే మనం జైలుకు వెళ్లాల్సిందేనని కేంద్రంపై పరోక్ష విమర్శలు చేశారు.
అందుకు మనం సిద్ధంగా ఉండాలన్నారు. మనం సమస్యలను ఎదుర్కొంటున్నామని భావిస్తున్నా.. అందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ రోజు జైలులో ఉన్న మన నేతలే మన హీరోలని, వారందరినీ చూసి చాలా గర్వపడుతున్నానని తెలిపారు. ఇలాంటి రాజకీయాలను ప్రజలు ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు.