మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ (AAP) అధినేత అరవింద్ కేజీవాల్ను (Arvind Kejriwal) గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల నుంచి తమకు పక్కా సమాచారం ఉందని చెబుతున్నారు.
అయితే, మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు కేజ్రీవాల్ బుధవారం మరోసారి గైర్హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అరెస్టుపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. రాజ్యసభ ఎన్నికలు, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల పనుల్లో తాను బిజీగా ఉన్నట్లు బుధవారం ఈడీకి కేజ్రీవాల్ రాతపూర్వక సమాధానాన్ని పంపారు.
ఈ నేపథ్యంలో తలెత్తబోయే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తనతో ధ్రువీకరించాయని ‘డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ ఆఫ్ ఢిల్లీ’ ఛైర్పర్సన్ జాస్మిన్ షా తెలిపారు. దర్యాప్తు సంస్థ పంపే ఎలాంటి ప్రశ్నావళికైనా జవాబులు తెలపడానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖలో తెలిపారు.
ఈ కేసులో తనను విచారించడానికి గల నిజమైన ఉద్దేశాన్ని తెలపాలంటూ ఇప్పటికే పలుమార్లు లేఖలు పంపానని వాటిపై ఈడీ స్పందించాలని కోరారు. ‘కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు జరపనున్నట్లు మాకు సమాచారం అందుతోంది. బహుశా ఆయనను అరెస్ట్ చేయొచ్చు అని ఆప్ కీలక నేత ఆతిశీ బుధవారం రాత్రి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇదే విషయాన్ని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ సైతం వెల్లడించారు.