ఢిల్లీ మద్యం పాలసీ కేసు (liquor policy case)లో ఈడీ (Enforcement Directorate) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి నిరాకరించారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ ఆరుసార్లు జారీ చేసినా ఆయన ఏమాత్రం లెక్కచేయలేదు. తాజాగా ఏడోసారి ఈడీ జారీచేసిన సమన్లనూ బేఖాతరు చేశారు కేజ్రీవాల్.
ఈ విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ ఈ అంశం కోర్టు పరిధి ఉన్నదని గుర్తుచేసింది. ఈడీ చట్టపరమైన ప్రక్రియను గౌరవించాలని, కేజ్రీవాల్‌కు పదేపదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని కోరింది. సీఎంకు పలుమార్లు సమన్లు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది.
‘ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. తదుపరి విచారణ మార్చి 16న జరగనుంది. రోజువారీ సమన్లు పంపే బదులు ఈడీ ఓపిక పట్టాలి. కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలి’ అని ఆప్ పేర్కొంది. కాగా, ఈడీ సమన్లు జారీ చేయగా కేజ్రీవాల్ వాటిని చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ కొట్టిపారేస్తున్నారు. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. అయితే కేజ్రీవాల్ కోర్టు విచారణకు హాజరుకాలేదు. దీంతో మార్చి 16కు విచారణ వాయిదా పడింది.
ఇప్పటి వరకు కేజ్రీవాల్‌కు ఈడీ నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 13, జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీల్లో విచారణకు నోటీసులు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ విచారణకు ఇంతవరకు హాజరుకాలేదు. తనను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 22వ తేదీన ఏడోసారి ఈడీ సమన్లు పంపి ఫిబ్రవరి 26వ తేదీన ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు రావాలని కోరగా కేజ్రీవాల్ ఈసారి కూడా హాజరుకాలేదు.