ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసు ఎటూ తేలడంలేదు. ఈ కేసులో ఢిల్లీ సీఎం(Delhi CM) అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal)ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన మాత్రం డుమ్మా కొడుతూ వస్తున్నారు. దీంతో చేసేది లేక ఈడీ కోర్టుకెక్కింది.
తమ నోటీసులను ఏమాత్రం లెక్కచేయడం లేదంటూ ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకు పలుమార్లు నోటీసులు పంపినా ఆయన పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొంది.
ఈడీ పిటిషన్‌ను రౌజ్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కేసుకు సంబంధించి ఈడీ సమర్పించిన కొన్ని సబ్మిషన్‌లను ఇవాళ (ఆదివారం) పరిశీలించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు మనీష్‌సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్టయ్యారు.
మరోవైపు, తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని కేజ్రీవాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కక్కరికి రూ.25కోట్ల చొప్పున ఆఫర్ చేసిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఈనెల 3న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి గంటల తరబడి చర్చించారు.