ఢిల్లీ (Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. సోమవారం విచారణకు హాజరు కావాలసి ఉంది. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఆరోసారి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ విచారణకు కేజ్రీవాల్ హాజరుకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు వెల్లడించాయి.
అధికారులు పంపిన సమన్లు చట్ట వ్యతిరేకమని, ఈడీ సమన్ల చట్టబద్ధతపై కోర్టులో కేసు నడుస్తోందని ఆప్ వర్గాలు మండిపడ్డాయి. అంతే కాకుండా కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యంతో పదే పదే ఈడీ సమన్లు పంపుతోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోర్టు నిర్ణయం వచ్చేవరకు ఈడీ ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు ఐదు సార్లు ఈడీ విచారణకు గైర్హాజరైన కేజ్రీవాల్.. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ కోర్టు విచారణకు హాజరయ్యారు.
రాష్ట్ర బడ్జెట్, విశ్వాస తీర్మానం కారణంగా తాను ప్రత్యక్షంగా కోర్టుకు రాలేకపోయానని వివరించారు. మార్చి 16న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని తెలిపారు. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికలు వస్తున్న క్రమంలో కేజ్రీవాల్‌కు ఈడీ నుంచి నోటీసులు వస్తుండటంపై ఆప్ వర్గాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయనీయకుండా చేసేందుకు ఇలా నోటీసులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనేకమందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌పై కూడా ఆరోపణలు రావడంతో.. ఈడీ నవంబర్ 1వ తేదీన తొలిసారి నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 21న మళ్లీ సమన్లు జారీ చేసింది. అయినా కేజ్రీవాల్ విచారణకు రాకపోవడంతో ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2న నోటీసులు జారీ చేసింది. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదు. ఇలా విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్నారు. కానీ పట్టువదలక ఈడీ నోటీసులు పంపిస్తూనే ఉంది. అయితే కేజ్రీవాల్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆసక్తికరంగా మారింది.