ఢిల్లీ సీఎం(Delhi CM) కేజ్రీవాల్(Kejriwal)కు ఎట్టకేలకు తీహార్ జైలు అధికారులు ఇన్సులిన్ ఇప్పించారు. ఈ విషయాన్ని మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కేజ్రీవాల్ రక్తంలో చక్కెర స్థాయి పెరిగి 320కి చేరింది. దీంతో ఆయన సోమవారం రాత్రి తీహార్ జైలులో ఇన్సులిన్ ఇచ్చినట్లు ఆప్ నేతలు చెబుతున్నారు. పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ వినిపించుకోని అధికారులు ఎట్టకేలకు స్పందించారని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ సోమవారం తీహార్ సూపరింటెండెంట్‌కు రాసిన లేఖలో తన గ్లూకోజ్ మీటర్ రీడింగ్ 250 నుంచి 320 మధ్య ప్రమాదకరమైన పరిధిని కలిగి ఉన్నందున ఇన్సులిన్ కోసం అభ్యర్థించారు. దీంతో జైలు అధికారులు వైద్యుల సూచన మేరకు ఆయనకు ఇన్సులిన్ డోస్ ఇప్పించారు. అయితే ఆప్ నేతలు మాత్రం బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. ఆ పార్టీ కేజ్రీవాల్‌ను చంపేయాలని కుట్ర చేస్తోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.
జైలు అధికారులు కావాలనే చికిత్స అందించడంలేదన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నది నిజమేనని, ఆయనకు ఇన్సులిన్ అవసరమని జైలు అధికారులు ఇప్పుడు తేరుకున్నారని తెలిపారు. అయితే ఇన్ని రోజులు ఉద్దేశపూర్వకంగానే చికిత్స అందించలేదని ఎంపీ సంజయ్ సింగ్ దుయ్యబట్టారు. అదేవిధంగా ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అవసరమే లేదని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా లోక్ సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ప్రజల్లో సానుభూతి చూపడానికే ఆప్ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సన్దేవా అన్నారు. కాగా, కేజీవాల్ తన రక్తంలో చక్కెర స్థాయిని పెంచడానికి, వైద్యపరమైన బెయిల్‌కు కారణమయ్యే ప్రయత్నంలో ప్రతిరోజూ మామిడిపండ్లు, ఆలూ పూరీ, స్వీట్లు తింటున్నారని ఈడీ గత వారం ఆరోపించిన సంగతి తెలిసిందే. తర్వాత ఇన్సులిన్ వివాదం మరింత పెరిగింది.